ప్రజలను మోసం చేయొచ్చని కేసీఆర్‌కు గట్టి విశ్వాసం

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు శుద్ధ అమాయకులని, వారిని ఇట్టే మోసం చేయొచ్చని కేసీఆర్ గట్టి విశ్వాసమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తేయడంపై కూడా రాములమ్మ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ రేటు తగ్గిపోయిందంటూ కరోనా కట్టడికి ఎలాంటి చర్యలూ ప్రకటించకుండానే ఉన్నట్టుండి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశారని అన్నారు.

ఇక లాక్‌డౌన్ ఎత్తేసిన రోజే సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటనలు, ప్రారంభోత్సవాలు మొదలుపెట్టారని, తన దత్తత గ్రామంలో వేలాదిమందితో సామూహిక భోజనాలకు కూడా ప్లాన్ వేశారని విజయశాంతి మండిపడ్డారు. సీఎం పర్యటనలు చూస్తుంటే కరోనా తగ్గిపోయిందని ఈ కార్యక్రమాలు పెట్టారో… లేక ఈ కార్యక్రమాల కోసం తెలంగాణలో కరోనా తగ్గిపోయిందని తప్పుడు నివేదికలు తెప్పించి లాక్‌డౌన్‌ ఎత్తేశారో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని… ప్రజలు ఈ విషయాలను గ్రహించలేని వెర్రివాళ్ళు కాదని అన్నారు.

జులై నుంచి విద్యా సంస్థల్ని తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంపై విజయశాంతి విమర్శలు గుప్పించారు. పిల్లల తల్లిదండ్రులు వద్దని వేడుకుంటున్నా విద్యా సంస్థల్ని తెరిచేందుకు కూడా సీఎం కేసీఆర్‌ అనుమతులిచ్చేసి విద్యార్థుల ప్రాణాల్ని పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయన్న విజయశాంతి… తెలంగాణ పాలకులు కేవలం తమ ప్రయోజనాల కోసం ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేందుకు సిద్ధపడ్డారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news