దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ పెట్టండి.. మోదీకి అన్ని వైపుల నుంచి ఒత్తిడి..

-

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం రోజు రోజుకీ పెరుగుతుండ‌డంతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించాల‌నే డిమాండ్ కూడా ఎక్కువ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోదీకి అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ప్ర‌తిప‌క్ష పార్టీలు, వైద్య నిపుణులు, న్యాయ మూర్తులు కూడా లాక్ డౌన్ పెట్టాల‌ని అంటున్నారు. దేశ‌వ్యాప్తంగా కోవిడ్ క‌ట్ట‌డికి ఒక ప‌క్కా ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయాల‌ని సూచిస్తున్నారు.

దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ పెట్ట‌డం వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌న‌మ‌వుతుంది, కానీ ప్ర‌జ‌ల జీవితాలు అంత‌క‌న్నా విలువైన‌వి, క‌నుక లాక్‌డౌన్ విధించాల్సిందేన‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ మోదీకి లేఖ రాశారు. ఇక దేశంలో కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే లాక్‌డౌన్ విధించ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.

దేశంలో ప‌రిస్థితి చేయిదాటింద‌ని, కోవిడ్ తీవ్రంగా వ్యాపిస్తుంద‌ని, అందువ‌ల్ల లాక్‌డౌన్ అనివార్య‌మ‌ని ఎయిమ్స్ చీఫ్ ర‌ణ‌దీప్ గులేరియా స్ప‌ష్టం చేశారు. ఇదే విష‌య‌మై ఆయ‌న ప‌లుమార్లు ఈ త‌ర‌హాలోనే వ్యాఖ్య‌లు చేశారు. అలాగే ప‌బ్లిక్ హెల్త్ ఫౌండేష‌న్ ఆఫ్ ఇండియా అధ్య‌క్షుడు శ్రీ‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అనుస‌రిస్తుంద‌ని, కానీ దేశ‌వ్యాప్తంగా ఒకే ప్ర‌ణాళిక అవ‌స‌ర‌మ‌ని అన్నారు. అందుకు లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌ని అన్నారు.

తాజాగా జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ ఎల్‌.నాగేశ్వ‌ర్ రావు, జ‌స్టిస్ ర‌వీంద్ర భ‌ట్‌ల‌తో కూడిన సుప్రీం కోర్టు త్రిస‌భ్య ధ‌ర్మాసం.. దేశంలో లాక్‌డౌన్ విధించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని కేంద్రానికి సూచించింది. కోవిడ్ వ్యాప్తి చెయిన్‌ను బ్రేక్ చేసేందుకు దేశ‌వ్యాప్తంగా ఒకే ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయాల‌ని, అదే స‌మ‌యంలో లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌భావితం అయ్యే పేద‌ల‌ను ఆదుకోవాల‌ని సూచించింది.

అయితే అన్ని వైపుల నుంచి అంత తీవ్ర స్థాయిలో ఒత్తిడి వ‌స్తున్నా మోదీ మాత్రం స్పందించ‌డం లేదు. లాక్‌డౌన్ పై ఆయ‌న తీవ్రంగా చ‌ర్చిస్తున్నార‌ని, ఎటూ తేల్చుకోలేక‌పోతున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు దేశంలో రోజూ 4 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు, 4వేల మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. దీంతో మోదీ తీసుకునే నిర్ణ‌యంపై ఉత్కంఠ నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version