బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో విశ్వాస పరీక్షలు నిత్య కృత్యం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ ఎమ్మెల్యే చేజారి పోతాడనే భయం ఆయా పార్టీలలో నెలకొంది. ఇటీవల ఢిల్లీ, ఝార్ఖండ్ రాష్ట్రాలలో అధికార పార్టీలు విశ్వాస పరీక్షల్లో నెగ్గగా.. ఇప్పుడు పంజాబ్ కూడా అదే బాట పట్టింది. ఈనెల 22న పంజాబ్ అసెంబ్లీ విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నట్లు ప్రకటించారు సీఎం భగవంత్ మాన్. అయితే గవర్నర్ అనుమతి నిరాకరించడంతో అది వాయిదా పడింది.
తాజాగా ఈనెల 27న శాసనసభ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అనుమతి ఇచ్చారు. దీంతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు ఊరట లభించింది. ఆపరేషన్ లోటస్ పేరిట ఆప్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం.. ఈనెల 27న శాసనసభ ప్రత్యేక సమావేశాలలో బల నిరూపణకు సిద్ధం కానున్నారు.