పెళ్లి ఎందకుకు చేసుకోలేదో తనకే ఇప్పటి వరకు తెలియదని.. కానీ ఎందుకు చేసుకోలేదని మాత్రం ఇప్పుడు అనిపిస్తోందని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. తనకు ఇప్పుడు పిల్లలు కావాలని అనిపిస్తోందని చెప్పారు. ఇటలీ పత్రిక కొరియర్ డెల్లా సెరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ అనేక విషయాలను పంచుకున్నారు. నానమ్మ ఇందిరా గాంధీకి తానంటే చాలా ఇష్టమని, అమ్మమ్మ పోలా మైనోకు ప్రియాంక గాంధీ అంటే ఎక్కువ ఇష్టమని తెలిపారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 వేల 500 కిలోమీటర్ల దూరం సాగిన భారత్ జోడో యాత్ర పూర్తయ్యే వరకు గెడ్డం గీసుకోరాదని తాను భావించినట్లు రాహుల్ తెలిపారు. ఇప్పుడు ఆ గెడ్డాన్ని ఉంచాలా లేదా తీసివేయాలా అనేది తాను నిర్ణయించుకోవాల్సి ఉందన్నారు. భారత్‌లో నియంతృత్వం ప్రవేశించిందని అన్నారు. ప్రజాస్వామ్య నిర్మాణాలు కూలిపోతున్నాయని, పార్లమెంట్ సరిగ్గా నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియంతృత్వానికి ప్రత్యామ్నాయ విజన్‌ను విపక్షాలు ప్రతిపాదించగలిగితే ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల్లో ఓడించవచ్చని రాహూల్ గాంధీ అన్నారు.