ఆ కేసులో నేను నిర్దోషిని.. నా తప్పేం లేదు.. అందుకే నేను క్షమాపణలు చెప్పను. కానీ నన్ను పార్లమెంట్ సమావేశాలకు అనుమతించండి.. అంటూ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పబోనని మరోసారి స్పష్టం చేశారు. ఈ కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాహుల్.. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని దుర్వినియోగం చేసి.. తప్పు చేయకపోయినా తాను క్షమాపణ చెప్పాలని కోరడం న్యాయ ప్రక్రియను అపహస్యం చేయడమేనని తన అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తన పిటిషన్లో.. మోదీ అనే పేరుతో ఎలాంటి వర్గం లేదని పేర్కొన్నారు. అధికారికంగా మోదీ సమాజం, మోదీ వర్గం అనేవి లేవని.. మోదీ వానిక సమాజ్, మోధ్ గంచి సమాజ్ అనే వర్గాలే ఉన్నాయని తెలిపారు. ఇంటిపేరు మోదీ అనేది అనేక కులాలవారికి ఉంటుందని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని చెప్పారు. మోదీ సమాజం మొత్తాన్ని రాహుల్ గాంధీ కించపరిచారన్న వాదనే తెరపైకి రాదని సుప్రీంకోర్టులో రాహుల్ తరఫున దాఖలైన పిటిషన్ పేర్కొంది.