పహల్గాం దాడి తరువాత జరిగిన భారత్, పాక్ ఘర్షణల్లో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన కశ్మీర్ చిన్నారుల బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించారు. కుటుంబపెద్దను కోల్పోయిన చిన్నారులకూ రాహుల్ అండగా నిలవనున్నారు. ఈ క్రమంలో పూంచ్‌లో 22 మంది బాధిత చిన్నారుల చదువులకయ్యే ఖర్చును రాహుల్ గాంధీ భరిస్తారని కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ తారీఖ్ హమీద్ కారా తెలిపారు. ఈ చిన్నారులు పట్టభద్రులయ్యే వరకూ సాయం అందుతుందని తారీఖ్ హమీద్ కారా తెలిపారు. తొలి విడత నిధులు బుధవారం విడుదల చేస్తామని చెప్పారు.
మే నెలలో రాహుల్ గాంధీ పూంచ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ దాడుల్లో బాధితులైన చిన్నారుల జాబితాను సిద్ధం చేయాలని స్థానిక నాయకులను కోరారు. ఆ తరువాత బాధిత చిన్నారుల తుది జాబితా ప్రభుత్వ రికార్డులతో సరి చూసుకున్నాక సిద్ధమైంది. పూంచ్ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ క్రైస్ట్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. పాక్ దాడుల్లో స్కూలుకు చెందిన 12 మంది చిన్నారులు మరణించడంపై విచారం వ్యక్తం చేశారు.