కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ వరకు కొనసాగే ఈ పాదయాత్రకు ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ నేతృత్వం వహిస్తారు. మొదటగా ఇవాళ ఉదయం శ్రీపెరుంబుదూరులో ఉన్న తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకాన్ని రాహుల్ సందర్శించారు. తన తండ్రి రాజీవ్ గాంధీకి ప్రత్యేక నివాళులు అర్పించారు. రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి.
తండ్రికి అంజలి ఘటించిన రాహుల్.. అక్కడి నుంచి తిరువనంతపురం మీదుగా కన్యాకుమారి చేరుకుంటారు. స్వామి వివేకానంద, తిరువళ్లువర్ విగ్రహాలు, మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ స్మారకాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ మండపం వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ జాతీయ జెండాను రాహుల్‌కి అందించి యాత్రను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకునేలా, దేశంలో భాజపాయేతర శక్తి బలంగా ఉందని చాటే ఉద్దేశంతో పకడ్బందీ ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.