వాయు కాలుష్యంతో అల్లాడుతున్న దిల్లీ వాసులకు వర్షం కాస్త ఊరటను కలిగిస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచి కురిసిన వానతో ఆ నగరంలో కాలుష్య తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. వాయు నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నందున కాలుష్య తీవ్రత మరింత తగ్గి.. వాయు నాణ్యత మరింత మెరుగు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నాయి.
అయితే వాయు కాలుష్యం తీవ్రత తగ్గించడానికి కృత్రిమ వాన కురిపించేందుకు దిల్లీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కేంద్రాన్ని అనుమతి కోరింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే కృత్రిమ వాన కురిపించాలని నిర్ణయించింది. ఇంతలోనే వాన కురవడంతో అటు నగరవాసులతో పాటు ఇటు ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంది. ఒక రెండ్రోజులు ఇలా సాధారణ వర్షం కురిస్తే దిల్లీలో వాతావరణం కాస్త కుదుట పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా అర్ధరాత్రి తర్వాత నుంచి ఓ మోస్తరు వర్షం కురవడంతో.. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో దిల్లీలో సగటు గాలి నాణ్యత సూచీ (AQI) 408కి తగ్గింది. గురువారం సాయంత్రం ఇది 437గా నమోదైంది. శుక్ర, శనివారాల్లో కూడా దిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో వర్షం కురిసే అవకాశముందని ఉండటంతో దీపావళి (నవంబరు 12) నాటికి దిల్లీలో కాలుష్యం మరింత తగ్గే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.