సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై మరోమారు స్పష్టమైన ప్రకటన చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ వార్తలపై స్పందించిన తలైవా.. ఇకపై తాను రాజకీయాల్లోకి రాబోనని అన్నారు. అంతేకాదు.. గతంలో తాను స్థాపించిన రజిని మక్కల్ మన్‌రమ్ (రజిని పీపుల్స్ ఫోరమ్)ను కూడా ఆయన రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి రజనీకాంత్ ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి వస్తానని, అందుకు దేవుడు శాసించాలని అంటున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 2021లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పారు. పార్టీని కూడా స్థాపించారు. అయితే డిసెంబర్ 2020లో తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఓ మూవీ షూటింగ్‌లో ఉన్న ఆయన సడెన్ గా అస్వస్థతకు గురి కావడంతో 24 గంటల్లోనే ఆయన ఆ ప్రకటన చేయడం విశేషం. దీంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
అయితే ప్రస్తుతం ఆయన అమెరికాలో చికిత్స తీసుకుంటుండగా, అక్కడి ఆర్ఎంఎం ఆఫీస్ బేరర్లతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన పై విధంగా ప్రకటించారు. ఇకపై రాజకీయాల్లోకి రాబోనని ఖరాఖండిగా చెప్పేశారు. తన పార్టీని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రజిని ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా అభిమానులు సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలిపారు.