కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో కలిపి మొత్తం 15 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. సమాజ్వాదీ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. మంగళవారం రోజున జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పలు పార్టీలపై ప్రభావం చూపించింది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి అనుకూలంగా ప్రత్యర్థులు ఓటు వేయగా.. కర్ణాటకలో మాత్రం కమలదళానికి ఎదురుదెబ్బ తగిలింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్ జరగగా బీజేపీ నుంచి ఎనిమిది, సమాజ్‌వాదీ పార్టీ నుంచి ముగ్గురు బరిలో నిలిచారు. క్రాస్ ఓటింగ్ వల్ల ఇందులో బీజేపీ ఎనిమిది స్థానాల్లో, సమాజ్వాదీ పార్టీ రెండు చోట్ల గెలుపొందింది. హిమాచల్ ప్రదేశ్‌లో క్రాస్ ఓటింగ్ జరగడంతో ఒకే స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ గెలుపొందింది.
ఇక కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబెట్టిన ముగ్గురు అభ్యర్థులు అజయ్ మాకెన్, సయ్యద్ నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ విజయం సాధించారు. బీజేపీ, జేడీఎస్ చెరో చోట పోటీచేయగా జేడీఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.