ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతికి రాజ్యసభ నివాళులలు అర్పించింది. ఉదయం 10 గంటలకు రాజ్యసభ ప్రారంభం అవ్వడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు లతా మంగేష్కర్‌ను స్మరించుకుంటూ సందేశం చదివారు. లతాజీ మరణంతో ఈ దేశం గొప్ప గాయని, దయామూర్తిని మహోన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ఆమె మరణం ఓ శకానికి ముగింపు, సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది అని చైర్మన్ వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేసారు. ఆ తరువాత సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. లత గౌరవార్థం సభను గంట పాటు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు.
లతా మంగేష్కర్ దాదాపు 80 సంవత్సరాల పాటు పాటలు పాడారు. కొవిడ్ స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆమె కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యులు, కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ తరుణంలోనే శనివారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆదివారం ఉదయం మృతి చెందారు. సాయంత్రం శివాజీ పార్కులో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.