ప్రధాని నరేంద్రమోదీని ఎన్డీఏపక్ష నేతగా ఎన్నుకునేందుకు ఆ కూటమి తరఫున గెలిచిన ఎంపీలంతా పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎన్డీఏ కీలకనేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తోపాటు ఎన్డీయే ఇతర ఇతర ముఖ్యనేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు బీజేపీ పదాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ రాజ్‌నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఎన్డీయే లోకసభా పక్ష నేతగా మోదీ పేరు రాజ్‌నాథ్ ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను అమిత్‌షా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు నాయుడు, కుమారస్వామి బలపరిచారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. 1962 తర్వాత వరుసగా మూడోసారి ఎవరూ ప్రధాని కాలేదని అన్నారు. మోదీ దూరదృష్టిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, పదేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వం దేశానికి సేవలందించిందని తెలిపారు. ప్రపంచ దేశాల నేతలు మోదీని ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. దేశానికి దశ దిశ నిర్దేశించడంలో మోదీ సఫలమయ్యారన్న రాజ్‌నాథ్ భారత్ కొత్త నేతృత్వం అందిస్తుందని ప్రపంచం విశ్వసిస్తోందని వ్యాఖ్యానించారు.