డాక్టర్‌ రెడ్డీస్ నుంచి రష్యా వ్యాక్సిన్‌

రష్యాకు చెందిన గమలేయ నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదే స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ దేశంలో అడుగు పెట్టనుంది. ఈ వ్యాక్సిన్‌ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీ కోసం హైదరాబాద్‌ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో కొవిడ్‌–19 వ్యాక్సిన్‌ విషయంలో భారత్‌లో పెద్ద ముందడుగు పడింది.

అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్‌డీఐఎఫ్‌ సరఫరా చేయనుంది. పరీక్షలు విజయవంతం అయి, వ్యాక్సిన్‌ నమోదు ప్రక్రియ పూర్తి అయితే.. ఈ ఏడాది చివరి నుంచే దేశంలో వ్యాక్సిన్ల డెలివరీ ఉండే అవకాశం ఉందని రెడ్డీస్‌ ప్రకటించింది.