కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఇప్పటికీ రద్దీ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భక్తులు శబరిమలకు పోటెత్తారు. రోజుల తరబడి దర్శనానికి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో కొంత మంది దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. భక్తుల రాకతో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం కూడా బాగా పెరిగింది. ఈ సీజన్లో అయ్యప్ప ఆదాయం రూ.200 కోట్లు దాటింది.
ఈ నెల 25 వరకు(గత 39 రోజులది) రూ.204.30 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) మంగళవారం వెల్లడించింది. ఇందులో భక్తులు సమర్పించిన నాణేల ద్వారా రూ.63.89 కోట్లు, అరవణ ప్రసాదం విక్రయంతో రూ.96.32 కోట్లు, అప్పం ప్రసాదం విక్రయం ద్వారా రూ.12.38 కోట్లు వచ్చినట్లు తెలిపింది. భక్తులు సమర్పించిన నాణేలను పూర్తిగా లెక్కిస్తే ఆదాయం మరింత పెరుగుతుందని పేర్కొంది. ఈ నెల 25 వరకూ శబరిమలను 31,43,163 మంది దర్శించుకున్నారని, 7,25,049 మందికి అన్నదానం నిర్వహించినట్లు ట్రావెన్కోర్ బోర్డు వివరించింది.