మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని వీలైనంత త్వరగా తిరుగులేని పార్టీగా మార్చేందుకు ఆ పార్టీ అధినేత , సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన పలుమార్లు బహిరంగ సభలు నిర్వహించి ఆ రాష్ట్ర ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. తాజాగా ఆయన మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. అయితే కేసీఆర్ పర్యటనపై శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.
మహారాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభావం ఏమాత్రం ఉండబోదని సంజయ్ రౌత్ అన్నారు. ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలానే నాటకాలాడితే.. తెలంగాణలోనూ అధికారం కోల్పోవడం ఖాయం. కేవలం ఓటమి భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రకు వస్తున్నారు. 12 నుంచి 13 మంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు మాత్రమే. బీఆర్ఎస్.. బీజేపీ బీ టీం. బీజేపీయే ఆయన్ను మహారాష్ట్రకు పంపినట్లు అనిపిస్తోంది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ బలంగా ఉంది’’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.