రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్ర సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ప్రస్తుతం తనకు మూడేళ్ల రాజ్యసభ పదవికాలం ఉందని ఆ తర్వాత ఎన్నికల్లో కూడా పోటీ చేయబోనని పవార్ వెల్లడించారు. అదనపు బాధ్యతలను చేపట్టబోనని స్పష్టం చేశారు.
కానీ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో పని చేస్తూనే ఉంటానని శరద్ పవార్ వెల్లడించారు. తాను రిటైర్ అయినా బడుగు, బలహీన వర్గాలు, విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు. తదుపరి అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పవార్ పేర్కొన్నారు. కమిటీలో అజిత్ పవార్, సుప్రియా సూలే, జయంత్ పాటిల్, ప్రఫుల్ పటేల్ ఉన్నారు. పవార్ తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, పవార్ ఇంత అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తెగ చర్చ నడుస్తోంది.