శిర్డీలో మే 1 నుంచి నిరవధిక బంద్ నిర్వహించనున్నారు. సాయిబాబా ఆలయానికి ప్రతిపాదించిన సీఐఎస్‌ఎఫ్ భద్రతను గ్రామస్థులు వ్యతిరేకించారు. శిర్డీలోని సాయిబాబా ఆలయానికి మరింత భద్రతను కల్పించాలని సాయి సంస్థాన్ ట్రస్టు పెద్దలు, మహారాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా ఆలయానికి సీఐఎస్‌ఎఫ్ భద్రతను ఏర్పాటు చేయడంపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని శిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు.
ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది చూస్తున్నారు. ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటున్నారు. ఆలయాన్ని ప్రతి రోజూ బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తుంది. సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్‌లో ఆలయ భద్రతపై ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన బెంచ్ సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. సీఐఎస్‌ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ మద్దతు పలికింది. ఈ నిర్ణయాన్నే శిర్డీ గ్రామస్థులు వ్యతిరేకించారు.
గ్రామస్థుల డిమాండ్లు ఇవే..
సాయిబాబా మందిరానికి సీఐఎస్‌ఎఫ్ భద్రత వద్దు.
* సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలి. ప్రభుత్వ డిప్యూటీ కలెక్టరు, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ ఉండాలి.
* శిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీల బోర్డును వీలైనంత త్వరగా నియమించాలి. ఇందులో 50 శాతం ధర్మకర్తలు శిర్డీ నుంచే ఉండాలి.