సింగర్ సిద్దు మూసేవాలా హత్య కేసు నిందితుడు బిష్ణోయ్ కి ఏడు రోజుల పోలీస్ కస్టడీ

పంజాబీ గాయకుడు సిద్దు మూసేవాల హత్య కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ ని ఏడు రోజుల పోలీస్ కస్టడీకి మన్సా లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. దీంతో అతడిని మన్సా నుంచి మొహాలికి తరలించనున్నారు. వంద మంది పోలీసులు, 24 వాహనాల కాన్వాయ్, బుల్లెట్ ప్రూఫ్ కారు లో అతడిని తీసుకెళ్తున్నారు. నేరస్తుల కోసం మన వ్యవస్థలు ఎంత ఖర్చు చేస్తున్నాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం.

మొహాలికి తరలించిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం(సిట్), యాంటీ గ్యాంగ్ స్టర్, టాస్క్ ఫోర్స్, ఇతర దర్యాప్తు విభాగాలు బిష్ణోయ్ ని విచారించనున్నాయి. సిద్దు మూసేవాలా హత్యకేసులో అతడి పాత్ర, ఇతరులు ఎవరున్నారు అనే విషయాలను రాబట్టనున్నారు. మే 29న ఉదయం మూసేవాలా ఆగంతకుల కాల్పులకు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.