ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ను పదేపదే ఉల్లంఘిస్తున్నా ఈసీ ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. మోదీ ఎన్నికల ఉల్లంఘనపై తాము పలుమార్లు ఫిర్యాదు చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. తప్పు చేసిన వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా సరే ధైర్యంగా చర్యలు తీసుకునే డీఎన్‌ఏ ప్రస్తుత ఈసీలో లేదంటూ విమర్శించారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్‌లు అయోధ్య రామాలయాన్ని బుల్డోజ్ చేస్తాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించాలని తాము ఈసీకి ఫిర్యాదు చేశామని ఏచూరి తెలిపారు. ‘ఎస్పీ, కాంగ్రెస్‌లు అయోధ్య రాముడిని మళ్లీ టెంట్‌లోకి పంపిస్తాయి. ఆలయంపైకి బుల్డోజర్లు పంపిస్తాయ’ని మోదీ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని దానిపైనా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రసంగాలు తరచూ సమాజంలోని సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉంటున్నాయంటూ వీడియో, పత్రికల క్లిప్పులను పంపించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకూ ఈసీ ఉపక్రమించలేదని ఏచూరి ఆక్షేపించారు.