భాగ్యనగరాన్ని వర్షం మరోసారి ముంచెత్తించింది. శనివారం కురిసిన వానకు నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లితో పాటు మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, మన్సూరాబాద్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్ ప్రాంతాల్లోపాటు చిలకలగూడ, అల్వాల్, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, అడిక్‌మెట్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్ లింగంపల్లి, కవాడి గూడ, దోమల గూడ, భోలక్ పూర్, మలక్‌పేట, జవహర్‌నగర్‌లో కురిసిన జోరు వాన రహదారులను ముంచెత్తింది.
వనస్థలిపురంలో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. చింతల్‌కుంట వద్ద వర్షపు నీరు చేరి చెరువును తలపించింది. పనామా- ఎల్బీనగర్ మధ్య వాహనాలు స్తంభించిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఎగువ నుంచి కురిసిన వర్షపు నీరు జాతీయ రహదారిపైకి చేరడం, దానికితోడు విస్తరణ పనుల మధ్య రోడ్డంతా వరదనీటితో నిండిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి చెరువును తలపించింది. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల కొద్ది వాహనదారులు రహదారిపైనే ఎదురుచూడాల్సి వచ్చింది.