ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ-కశ్మీర్ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధిలో ఈ ప్రాంతం సరికొత్త శిఖరాలను తాకుతోందని చెప్పారు. ‘ఆర్టికల్ 370’ రద్దు అనంతరం తొలిసారి కశ్మీర్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. బక్షీ స్టేడియంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ‘ఆర్టికల్ 370’పై ఒక్క జమ్మూ- కశ్మీర్నే కాదు, యావత్ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
అంతకుముందు స్థానికంగా రూ. 6400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని దేశానికి కిరీటంగా అభివర్ణిస్తూ.. రైతుల సాధికారత, పర్యటక అవకాశాలు వికసిత జమ్మూ-కశ్మీర్ నిర్మాణానికి బాటలు వేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులకు ముందస్తుగా మహాశివరాత్రి, రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. మోదీ పర్యటనను పురస్కరించుకుని కశ్మీర్ లోయలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. స్థానికంగా భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు.