ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ రంగానికి సంబంధించిన అనుబంధ వృత్తుల చట్టాన్ని అమలు చేయకపోవడంపై మండిపడింది. జాతీయ వైద్య కమిషన్, భారత దంత వైద్య మండలి, ఇతర నియంత్రణ మండళ్ల పరిధికి వెలుపల ఉన్న ఆరోగ్య సంరక్షణ అనుబంధ వృత్తులకు సంబంధించి రాష్ట్ర స్థాయి మండళ్లను ఏర్పాటు చేయాలని 2021లో తీసుకొచ్చిన నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ చట్టం చెబుతోంది. అయితే మూడేళ్లయినా ఈ చట్టం అమలు కాకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.
ఈ క్రమంలోనే అక్టోబరు 12వ తేదీకల్లా ఈ చట్టాన్ని అమలు చేయాలని.. దీన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర సభ్యులుగా ఉన్న ధర్మాసనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. ఈ చట్టం అమలుపై రెండు వారాల్లోగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో అన్‌లైన్ సమావేశం నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించింది.