నేర చరిత ఉన్న నేతల్లో వణుకుపుట్టిస్తోంది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసుల విచారణపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీచేయడంతో ఆ నేతల గుండెల్లో రైళ్లుపరిగెడుతున్నాయి. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్, సివిల్ కేసులను సత్వరం విచారించేలా చర్యలు తీసుకోవాలని 2016లో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వరుసగా రెండోరోజు కూడా విచారించింది. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులపై 4,442 కేసులు విచారణలో ఉన్నాయని అమికస్ క్యూరీ హన్సారియా సుప్రీం ధర్మాసనానికి వివరించారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే 2,556 కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు. 200 కేసులు పీసీఏ, పీఎంఎల్ఏ, పోస్కో చట్టాల కింద నమోదుకావడం గమనార్హం. ఈ కేసుల విచారణను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది.
కేసుల విచారణకు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక కోర్టులు, జడ్జీల సంఖ్య, వారి పదవీకాలం, ఒక్కో న్యాయమూర్తి ఎన్ని కేసులు విచారించగలరు.. తదితర 9 అంశాలతో యాక్షన్ ప్లాన్‌ను సుప్రీంకోర్టు అమికస్ క్యూరీగా నియమించిన సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియాకు మెయిల్ ద్వారా పంపాలని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ రిషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. అంతేగాకుండా… ప్రత్యేక కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతీ హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలని సీజేలకు సుప్రీం ధర్మాసనం సూచించింది. ఇక స్టే ఉన్న కేసులపై రోజువారీ విచారణ చేపట్టి రెండు నెలల్లో కొలిక్కి తేవాలని స్పష్టంచేసింది.