ప్రధాన మంత్రి మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఆ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై వచ్చే సోమవారం విచారణ చేపట్టనున్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను పరిశీలించింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లలో మోదీ హస్తం ఉన్నట్లు బీబీసీ తన డాక్యుమెంటరీలో చూపించింది. దీంతో ఆ డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది.
ఆ డాక్యుమెంటరీని యూట్యూబ్, ట్విటర్లో షేర్ చేయరాదు అంటూ ఇటీవల కేంద్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. రెండు భాగాలు ఉన్న ఆ డాక్యుమెంటరీని బ్యాన్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఎంఎల్ శర్మ తన పిటిషన్లో ఆరోపించారు.