వర్షాల ప్రభావం.. త్వరలో భారీగా పెరగనున్న ఉల్లి ధరలు..?

-

గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టమోటా, పచ్చిమిర్చి అయితే అసలు కొనేటట్లు లేవు. కేజీ వందపైనే ఉన్నాయి. సామాన్యులు వీటిని కొనడం మానేశారు. ప్రభుత్వాలు సబ్సిడీపై టమోటాలను అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా టమోటా, మిర్చి ధరలు బాగా పెరగటంతో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తమై సబ్సిడీపై ఇవ్వడం, తగ్గించే చర్యలు చేపట్టింది. అయితే టమోటా దారిలో ఉల్లి కూడా ఉండనుందని నిపుణులు అంటున్నారు.

అక్టోబర్-నవంబర్ నాటికి ఉల్లిపాయల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అసలే టమాట ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా అదే దిశలో వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రెండు నెలల తర్వాత ఉల్లిపాయల ధరలు భారీగా పెరగొచ్చని నేషనల్ కమోడిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా మనీకంట్రోల్‌కు వివరించారు.

ప్రస్తుతం మునుపటి ఉత్పత్తుల నుంచి నిల్వ చేసిన బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయల్ని వినియోగిస్తున్నామని, ఈసారి వర్షాలు సకాలంలో కురవలేదని, ఈ అంతరాయం ప్రభావాన్ని అక్టోబర్-నవంబర్లో చూస్తామని ఆయన తెలిపారు. వర్షాల కారణంగా శీతాకాలపు ఉల్లి పంట బాగా దెబ్బతింది, ఇది వేరు కూరగాయ కాబట్టి, పొలాలు నీటితో నిండటం వల్ల ఇది కుళ్లిపోతుందని, ఈ రుతుపవనాల్లో మహారాష్ట్రలో వర్షపాతం తక్కువగా ఉన్నందున ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ముందే అప్రమత్తం అవుతున్నట్టు సమాచారం. నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) కలిసి ఇప్పటివరకు 2.9 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను సేకరించిందట.

ఈ రెండు కేంద్ర ఏజెన్సీల మొత్తం సేకరణ ప్రక్రియ వచ్చే రెండు వారాల్లో పూర్తి కానుందని, నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌ ద్వారా ఈ ఏడాది 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయల సేకరణను లక్ష్యంగా కేంద్రం నిర్ణయించిందన్నది ఆ వార్తల సారాంశం. అంటే ఈ రెండు ఏజెన్సీలకు ఒక్కొక్కటి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల్ని సేకరించనున్నాయి.

గతేడాది కేంద్ర ప్రభుత్వం ఒక్క నాఫెడ్ ద్వారానే 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి బఫర్ స్టాక్‌ను సృష్టించింది. ఈ సారి ఎన్‌సీసీఎఫ్‌ ద్వారా కూడా ఉల్లిని సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో ధరల్ని నియంత్రించేందుకు బఫర్ స్టాక్‌ను ఉపయోగిస్తుంది. ఏది ఏమైనా టమోటా, మిర్చి, ఉల్లి, బంగాళదుంప ఇవి సామాన్యులు విరివిగా వాడే కూరగాయలు. వీటి ధరలు పెరిగితే సామాన్యుడు బాగా దెబ్బతింటాడు.

Read more RELATED
Recommended to you

Latest news