తమ డిమాండ్లు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా ఢిల్లీ సరిహద్దులో అన్నదాతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడుసార్లు కేంద్రమంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య చర్చలు జరగగా.. తాజాగా నాలుగోసారి కూడా చర్చలు జరిపారు. కేంద్రం తరుఫున కేంద్రమంత్రులు.. అర్జున్ ముండా, పీయూష్ గోయెల్, నిత్యానంద్ రాయ్‌తో రైతు సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఇందులో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు.
నాలుగో విడుత చర్చలు ముగిశాక కేంద్రమంత్రి పియూష్ గోయెల్.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కనీస మద్దతు ధరపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర సంస్థలు.. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను పండించే రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాక ఐదేళ్ల వరకు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదన చేసింది. రైతులు పండించే కందులు,మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న, పత్తి పంటలను MSPకి కొనుగోలు చేసేందుకు.. NCCF, NAFED వంటి కేంద్ర సంస్థలు 5 ఏళ్ల వరకు ఒప్పందం కుదుర్చుకుంటాయి. కొనుగోలు చేసే పరిమాణంపై ఎలాంటి పరిమితి ఉండదు. ఇందుకోసం ఓ పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేస్తాం. తమ ప్రతిపాదన వల్ల పంజాబ్‌లో ఉన్న పంటలకు రక్షణ లభిస్తుంది. భూగర్భ జలమట్టాలు మెరుగుపడి.. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని’ ఆయన చెప్పారు.