భారత్లో టమాట ధరలు అమాంతకం ఆకాశాన్నంటాయి. చాలా ప్రాంతాల్లో కిలో టమాట ధర వంద రూపాయలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ వినూత్న ఆలోచన చేసింది. టామాట గ్రాండ్ ఛాలెంజ్ పోటీ పెట్టింది. టమాటా ఉత్పత్తి, ప్రాసెసింగ్, స్టోరేజీకి వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే వారికి ఈ పోటీ పెట్టినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
పోటీలో భాగంగా ఉత్పత్తికి ముందు, ప్రాథమిక ప్రాసెసింగ్, ఉత్పత్తి తర్వాత కోత, నిల్వ, వాటి నిర్వహణకు సాంకేతిక సలహాలను అందించాల్సి ఉంటుంది. వ్యవసాయ క్షేత్రం, గ్రామీణ, పట్టణ స్థాయిలో ఉత్పత్తుల నిర్వహణపై సలహాలివ్వాల్సి ఉంటుంది. నాలుగు విషయాల్లో కొత్త ఆలోచనలను ఇవ్వాల్సి ఉంటుందని, అందులో అభివృద్ధి పరిచిన టమాటా విత్తనాలను ఉత్పత్తి చేయడం, పంట ప్రణాళికలకు సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఉత్పత్తి వచ్చాక ప్యాకింగ్.. ఎక్కువ కాలం నిల్వ ఉండేలా టెక్నాలజీ సహకారం ఉన్నాయని ఆ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ వివరించారు. గతేడాది ఉల్లిపై చేసిన ఇటువంటి ప్రయోగానికి 600 వరకూ సలహాలొచ్చాయని, వాటిలో 13 సలహాలను అమలు చేస్తున్నామని తెలిపారు.