రైలు ప్రమాదాల బాధితులకు పరిహారం పదిరెట్లు పెంపు

-

రైలు ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పదింతలు పెంచుతూ రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు మొన్నటివరకు రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.25,000 బదులు రూ.2.5 లక్షలు; స్వల్పగాయాలైనవారికి రూ.5,000 బదులు రూ.50,000 ఇస్తారు. అవాంఛిత ఘటనల విషయంలో ఈ పరిహారాలు రూ.1.50 లక్షలు, రూ.50,000, రూ.5,000గా ఉంటాయి. ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనలు, రైల్లో దోపిడీలు వంటివి అవాంఛిత ఘటనల కిందికి వస్తాయని రైల్వే బోర్డు తెలిపింది.

2013లో చివరిసారిగా ఈ మొత్తాలు పెంచారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పదింతలు ఒకేసారి పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు నుంచే ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఒకవేళ రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినవారు 30 రోజులకు మించి ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి వస్తే రోజుకు రూ.3,000 వంతున ప్రతీ 10 రోజులకోసారి అదనపు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news