లోక్‌సభ ఎన్నికల వేళ దిల్లీలో రాజకీయ సమీకరణాలు నిమిషానికో రకంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆప్, కాంగ్రెస్లకు వరుస దెబ్బలు తాకుతున్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కోలుకోని విధంగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవల దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్వింద్‌సింగ్ లవ్లీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే.. ఇవాళ మరో ఇద్దరు నేతలు పార్టీ వీడారు.
దిల్లీ కాంగ్రెస్లో కీలక నేతలైన నీరజ్ బసోయ, నసీబ్ సింగ్‌లు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. వారిద్దరూ పశ్చిమ దిల్లీ, వాయవ్య దిల్లీ లోక్‌సభ స్థానాలకు పరిశీలకులుగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు రాజీనామా లేఖ పంపినట్లు పేర్కొన్న నీరజ్ బసోయ, నసీబ్‌సింగ్‌లు.. ఆప్‌తో పొత్తు, దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షునిగా దావిందర్ యాదవ్ నియామకానికి నిరసనగా పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఇలా వరుస రాజీనామాలతో కాంగ్రెస్ పార్టీ దిల్లీలో బలహీనంగా మారుతోంది. ఇప్పటికే కూటమిలో ఉన్న ఆప్ అధినేత, దిల్లీ సీఎం అరెస్టుతో ఆ పార్టీ కూడా కాస్త బలహీనపడిన విషయం తెలిసిందే.