యూఏఈ అధ్యక్షుడు కన్నుమూత..సంతాపం తెలియజేసిన ప్రధాని మోదీ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా జాయేద్ అల్ నహ్యాన్ ఇక లేరు. 73 ఏళ్ల షేక్ ఖలీఫా.. శుక్రవారం కన్నుమూసినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. షేక్ ఖలీఫా 2014 నవంబర్ 3 నుంచి యుఏఈ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ నుంచి వారసత్వంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1948 లో పుట్టిన షేక్ ఖలీఫా.. యూఏఈ కి రెండవ అధ్యక్షుడు. ఆ దేశ రాజధాని అబుదాబి కి 16వ పాలకుడు. ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు.

 

అయితే చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో ఉండటంతో ఇదే కారణమని తెలుస్తోంది. షేక్ ఖలీఫా మృతికి పలు దేశాల అధినేతలు ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. అయితే షేక్ ఖలీఫా మృతి పట్ల భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలియజేశారు.” షేక్ ఖలీఫా బిన్ జాయేద్ మరణించిన విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. అతను గొప్ప రాజనీతిజ్ఞుడు మరియు వివేకవంతమైన నాయకుడు. అతని ఆధ్వర్యంలో భారతదేశం- యూఏఈ సంబంధాలు అభివృద్ధి చెందాయి. భారతదేశ ప్రజల హృదయపూర్వక సంతాపం యూఏఈ ప్రజలకు ఉంది. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సంతాపం తెలియజేశారు నరేంద్రమోదీ.