దిల్లీలో యమునా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ అధికారుల్లో.. ప్రజల్లో భయం పుట్టిస్తోంది. యమునా నదికి వస్తున్న ప్రవాహంతో సమీప ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరి చెరువుల్లా మారిపోయాయి. రికార్డు స్థాయిలో యమునకు వస్తున్న వరద ప్రవాహంతో దిల్లీలోని వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను అధికారులు మూసివేశారు. ప్లాంట్ పంపుల్లోకి వరద నీరు చేరడం వల్ల మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
దీనివల్ల నగరంలో సుమారు 25 శాతం నీటిసరఫరా తగ్గిపోతుందని తెలిపారు. దాదాపు రెండ్రోజుల వరకు నగర వాసులకు నీటి సరఫరా ఉండదని వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం తర్వాత మళ్లీ నీటి సరఫరా పునరుద్దరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. కేంద్ర జల సంఘం ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు యమునా నది ప్రవాహం హెచ్చ స్థాయికి చేరుకుంటుందని, ఆ తర్వాత నీటి మట్టం తగ్గడం ప్రారంభం అవుతుందని వివరించారు. మరోవైపు యమునా నీటి మట్టం 208.46 మీటర్ల స్థాయికి చేరుకుంది.