నిన్నటి దాకా పంట లేదు ధర ఉంది
ఇప్పుడు పంట ఉంది ధర లేదు
ఇదీ టమాటా రైతుల దీనావస్థ
కర్నూలు జిల్లా రైతులు ధర లేక
కేజీ రూపాయికే పంటను అమ్ముకోలేక
దళారీలను అడ్డుకోలేక కన్నీటిపర్యంతం అవుతున్నారు.
ఆ మధ్య అంతా టమాట ధర భగ్గుమనడంతో విపరీతంగా వార్తలు ట్రోల్ అయ్యాయి. టమాట కొనలేక మధ్య తరగతి జీవులు నానా అవస్థలూ పడ్డారు.మార్కెట్ లో కృత్రిమ కొరత సృష్టించి కొందరు దళారులు పబ్బం గడుపుకున్నారు. దీంతో ధరలు తగ్గక, చాలా రోజుల పాటు పెద్ద యుద్ధమే నడిచింది. ప్రభుత్వం రంగంలోకి దిగి ధరల నియంత్రణ చేపడితే బాగుంటుంది అన్న వాదన కూడా వచ్చినా కొన్ని చోట్ల మాత్రమే ఆ విధంగా అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. కానీ కొన్ని చోట్ల దళారుల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోయింది. దీంతో టమాట రైతులు కొంత లాభం పొందినా, దళారుల బారిన పడ్డ వారంతా చాలావరకూ నష్టపోయారు.
ఇప్పుడు టమాట పంట ఇబ్బండి ముబ్బడిగా పండుతోంది. మార్కెట్ ను కూడా విపరీతంగా చేరుకుంటుంది.దీంతో మళ్లీ టమాట ధర ఒక్కసారిగా పడిపోయింది. కేజీ రూపాయికే కొనుగోలు చేసేందుకు దళారీలు కథ నడుపుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో కేజీ టమాట ధర ఒక్క రూపాయికే పలికింది. లింగాల మండలం, కోమన్నూతల గ్రామానికి చెందిన కాల్వ వెంకటేశ్ తనకున్న రెండెకరాల్లో టమటా సాగు చేయగా, పండిన పంటను సమీపాన ఉన్న నేర్జాంపల్లె మార్కెట్ కు తరలించాడు. మొత్తం 3300 కిలోలను తీసుకువెళ్లగా కేజీకి రూపాయి చొప్పున చెల్లిస్తామని అక్కడున్న బడా వ్యాపారులు చెప్పడంతో చేసేది లేక రోడ్డుపక్కనే పండ్లు పారబోసి ఇంటికి చేరుకున్నాడు.
తనకు పెట్టుబడి, రవాణా ఛార్జీ కలుపుకుని నాలుగువేలకు పైగా అయిందని, కానీ మార్కెట్ రేటు కారణంగా టమాటాలను రోడ్డు పాలు చేశానని కన్నీటి పర్యంతం అవుతూ చెప్పాడు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 9 వేల హెక్టార్లలో టమాటా పంట సాగు అవుతుందని, ఇప్పుడు ధర లేకపోవడంతో ఏం చేయాలో తోచడం లేదని సంబంధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు.