నేపాల్, బంగ్లాదేశ్,బర్మా, శ్రీలంక, భూటాన్, పాకిస్తాన్, మాల్దీవులు.. ఇవన్నీ భారతదేశం చుట్టూ ఉండే దేశాలు. వాటితో భారత్‌కి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కీలక సమయాల్లో భారత్ సాయం కోసం అర్ధించిన దేశాలు ఇవి. అయితే ఇప్పుడు ఆ దేశాల్లో అల్లర్లు శృతిమించిపోతున్నాయి. ఒక దాని తరువాత మరొక దేశంలో ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతున్నాయి. భారత్‌ను ప్రత్యక్షంగా దెబ్బకొట్టలేని చైనా ఇలా మిత్రదేశాలపై కాలుదువ్వుతోందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆయా దేశాల్లో అల్లర్లకు డ్రాగన్ కంట్రీ చేస్తున్న కుట్రలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మయన్మార్, శ్రీలంక, మాల్దీవుల్లోనూ చైనా ఇదే ఎత్తగడ వేసి సక్సెస్ అయింది.
మయన్మార్‌లో ఆంగ్‌సాంగ్‌సూకీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చింది. సైనిక ప్రభుత్వం ఏర్పాటుకు డ్రాగన్ సహకరించింది. ఇక శ్రీలంకకు కూడా భారీగా రుణాలు ఇచ్చి ప్రభుత్వం దివాలా తీసేలా చేసింది. చైనా ఇచ్చిన అప్పులు తీర్చలేని పరిస్థితిలో శ్రీలంకలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఆ దేశంపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది కమ్యూనిస్టు దేశం. ఇక మాల్దీవులు కూడా దాదాపుగా చైనా చేతుల్లోకి వెళ్ళిపోయింది. భారత్‌పై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ. గతంలో ఈ మూడు భారత మిత్ర దేశాలే. వాటిని భారత్‌కు దూరం చేయాలనే లక్ష్యంతో కుట్రలు చేస్తోందని చైనాపై పలువురు ప్రపంచ దేశాల నేతలు విరుచుకుపడుతున్నారు.
భారత్‌కు తన మిత్రదేశాలను దూరం చేయాలని కుట్రలు చేస్తూ కొంతవరకు చైనా సక్సెస్ అయిందనే చెప్పాలి. మరో మిత్ర దేశమైన బంగ్లాదేశ్‌పై ఇప్పుడు కన్ను పడింది. సైలెంట్‌గా ఉంటూ అక్కడి వారిని రెచ్చగొట్టి అలజడి సృష్టిస్తోంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌లో అల్లర్లు, అశాంతి సృష్టించడమే లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే భారత్‌పై చైనా ఇంతలా రెచ్చిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. కోవిడ్ సమయంలో చైనా యాప్‌లపై భారత్‌లో నిషేధం అమలుచేశారు. చైనా నడిపిస్తున్న లోన్‌యాప్‌లకు కూడా కళ్ళెం వేసింది.దీంతో చైనాకు ఆర్ధిక నష్టం చాలానే వచ్చిపడింది.
ఎలాగైనా భారత్‌ను దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో సరిహద్దుల్లో మ్యాప్‌లను మారుస్తూ ఇండియా భూభాగంలోకి వచ్చే ప్రయత్నం చేసింది. ఆ పప్పులేమీ ఉడక్కపోవడంతో ఇప్పుడు దొడ్డిదారి ఎంచుకుంది. ఇందులో భాగంగా భారత మిత్ర దేశాలను దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ కూడా అందుకు సహకరిస్తోందని అంతర్జాతీయ మీడియా చెప్తోంది. నిన్నటి వరకు బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లు అందులో భాగమే అనే అనుమానాలు కలుగుతున్నాయి. భారత్‌తో మంచి స్నేహబంధం ఉన్న బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌ల అంశాన్ని తెరపైకి తెచ్చి అల్లర్లకు కారణమైంది చైనా. మూడు నెలలుగా జరుగుతున్న అల్లర్లు ప్రధాని షేక్ హసీనా గద్దె దిగే వరకు కొనసాగాయి.
అల్లర్లతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచివెళ్ళిపోయారు. ఒకవేళ దేశంలో అల్లర్లకు రిజర్వేషన్ల అంశమే కారణమైతే.. షేక్ హసీనా వెళ్ళిపోగానే అవి సద్దుమణగాలి. కానీ,హసీనా వెళ్ళిపోయినా ఆదేశంలో ఇప్పటికీ అల్లర్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యువత ఈ అల్లర్లలో కీలకపాత్ర పోషిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారు. ఇప్పటికే వెయ్యి మంది వరకు మరణించారని అంచనా. తాత్కాలిక ప్రధాని బాధ్యతలు తీసుకున్నప్పటికీ అక్కడి మైనారిటీలు, హిందువులే లక్ష్యంగా ఇంకా దాడులు జరుగుతునే ఉన్నాయి. ఆలయాలను ధ్వంసం చేయడమే కాకుండా హిందువులను కిరాతకంగా చంపుతున్నారు. అంటే మొత్తంగా పరిశీలిస్తే ఈ అల్లర్ల అసలు ఉద్దేశ్యం రిజర్వేషన్‌లు కాదనేది తేలిపోయింది.
దేశంలో అలజడి సృష్టించి తద్వారా భారత్‌కి కంటిమీద కునుకు లేకుండా చేయాలనేది చైనా ఎత్తుగడగా తెలుస్తోంది. అందుకే హసీనా రాజీనామా చేసి వెళ్ళిపోయినా అల్లర్లు ఆగలేదు. భారత్‌తో బంగాదేశ్‌కు ఉన్న వ్యాపార సంబంధాలను దెబ్బతీసి వాటిని చైనా వైపు తిప్పుకోవాలని డ్రాగన్ కంట్రీ కుట్ర చేస్తోంది. అచ్చం శ్రీలంకలో జరిగిన దానిలా బంగ్లాదేశ్‌కు ఆర్థికసాయం అందించి అక్కడి ఆర్ధిక వ్యవస్థను దివాలా తీయించాలని చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. చైనాతో చేయికలిపి పాకిస్తాన్ ఇప్పుడు ఎంతటి దురవస్థలో ఉందో అంతకంటే దారుణమైన స్థితిలోకి బంగ్లాదేశ్ జారిపోవడం ఖాయమని విశ్లేషకుల అంచనా. కానీ నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత్‌ను చైనా దెబ్బకొట్టలేదని వారు చెప్తున్నారు.