కుల గణనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వహిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుల గణనను ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించింది. కుల గణనను నిర్వహించేందుకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ ఈ విధంగా స్పందించింది.
భారత్ జోడో యాత్ర సమయంలో రాజస్థాన్ లో అనేక వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా కుల గణనను అక్కడి బీసీ సంఘాలు ప్రధానంగా ప్రస్తావించాయి. వారి మాటలను రాహుల్ గాంధీ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగా కుల గణనను చేపట్టాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది స్వాగతించాల్సిన విషయం అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీల కోసం విధానాలను రూపొందించేందుకు ఇది దోహదపడుతుందన్నారు జైరాం రమేష్. సామాజిక న్యాయం, జనాభా ప్రాతిపదికన వారికి హక్కులు కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. అయితే ఇటువంటి చర్యలను బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. ప్రధానమంత్రి కూడా కుల గణనపై ఎందుకు మౌనంగా ఉన్నారని జైరాం రమేష్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.