ప్రస్తుత ఎల్‌నినో చాలా బలంగా ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది. రానున్న కొద్ది నెలల్లోనూ వాతావరణ పోకడలపై దీని ప్రభావం కొనసాగుతుందని తెలిపింది. ఈ ఏడాది మార్చి- మే మధ్యలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది. ప్రస్తుత ఎల్‌నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది.
ఈ ఏడాది జనవరి సముద్ర-ఉపరితల ఉష్ణోగ్రత.. గతంలో ఆ నెలలో ఎన్నడూ లేని స్థాయిలో నమోదైందని డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ సెలెస్టె సాలో తెలిపారు. దీనికి ఎల్‌నినో ఒక్కటే కారణం కాదని పేర్కొన్నారు. మార్చి- మే మధ్య ఎల్‌నినో పరిస్థితులు కొనసాగడానికి దాదాపు 60 శాతం అవకాశం ఉందని వెల్లడించారు. ఏప్రిల్- జూన్ మధ్య తటస్థ పరిస్థితులు (ఎల్‌నినో కానీ దానికి భిన్నమైన లానినా కానీ లేకపోవడం) నెలకొనడానికి 80 శాతం అవకాశం ఉందని వివరించారు. మరోవైపు భారత్‌లో జూన్- ఆగస్టు మధ్య లానినా ఏర్పడితే 2023 కన్నా ఈ ఏడాది రుతుపవనాల ద్వారా మెరుగైన వర్షాలను పొందొచ్చని చెబుతున్నారు.