చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది. ఈ బిల్లుకు రాష్ట్రపది ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఈ రోజు ఈ బిల్లుపై సంతకం పెట్టారు. అనంతరం, బిల్లు కాపీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఆమె కూడా సంతకం పెట్టడంతో దశాబ్దాల తరబడి బిల్లుగానే పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు చట్టంగా మారాయి. అనంతరం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ చట్టం ప్రకారం ఎన్నికున్న ప్రతినిధుల సభలకు మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఉంటాయి. అంటే లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం లభించనుంది. ఇందుకోసం లోక్ సభలో ఇద్దరు ఎంపీలు మినహా అందరూ రాజ్యాంగ సవరణకు ఓటు వేశారు. రాజ్యసభలో ఏకగ్రీవంగా ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ నెలలో కేంద్రం నిర్వహించిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చట్టం వెంటనే అమల్లోకి రావడం లేదు.
2024 లోక్ సభ ఎన్నికల్లోనూ ఈ చట్టం అమల్లోకి రాదు. ఈ చట్టాన్ని అమల్లోకి తేవడానికి ముందు జనాభా గణన నిర్వహించాలని, డీలిమిటేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏ స్థానాలకు మహిళలకు కేటాయించాలనేది తేలుతుందని వివరించింది.