స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నిరుపేదల కడుపుకొట్టి అందులోంచి సొమ్ము వెనకేసుకోవాలన్న ఆలోచనే దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. ఆ కుంభకోణాన్ని విజయవంతంగా అమలు చేశారని, కానీ ఇవాళ లీగల్ గా అన్నీ కరెక్టుగానే ఉన్నాయని అంటున్నారని, వైసీపీ కక్షపూరితంగానే ఇదంతా చేస్తోందని తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబునాయుడు అని, ప్రజలు నమ్మక చస్తారా అనే రీతిలో టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని సజ్జల విమర్శించారు. దొంగతనం చేసి దొరికిపోయిన చంద్రబాబుకు మద్దతివ్వడం సరైనదేనా? అని ప్రశ్నించారు. విషయం ఉంటే మాట్లాడండి… స్కాం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడడంలేదని సజ్జల నిలదీశారు.
మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. తాము రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నామని ఆరోపిస్తున్నారని..అలా చేయాలంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేవాళ్లమని వ్యాఖ్యానించారు. అప్పటికే కావాల్సిన ఆధారాలు ఉన్నాయన్నారు. పూర్తిగా విచారణ చేసిన తరువాత సీఐడీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టిందని చెప్పుకొచ్చారు. నాలుగు కేసులు విచారణలో ఉన్నాయని..వీటిలో పూర్తి ఆధారాలతో చంద్రబాబు టీం దొరికిపోయిందని చెప్పారు. అడ్డంగా దొరికిన దోపిడీ దొంగల ముఠాకు ఎల్లో సపోర్ట్ చేస్తోందని సజ్జల మండిపడ్డారు.