నవజ్యోత్ సింగ్​ సిద్ధూ ఇంట్లో అనుమానాస్పద వ్యక్తి.. బ్లాంకెట్ కప్పుకుని మేడపై..

-

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. తన ఇంటిపై ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించినట్లు తెలిపారు. పటియాలాలోని తన ఇంటి మేడపై ఓ వ్యక్తి బ్లాంకెట్ కప్పుకుని కనిపించాడని ట్విటర్ వేదికగా వెల్లడించారు. దీనిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

“ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బూడిద రంగు బ్లాంకెట్​ను చుట్టుకుని ఓ వ్యక్తి కనిపించాడు. అతడిని గుర్తించిన నా సిబ్బంది వెంటనే అలారం మోగించాడు. మిగతా వారిని అప్రమత్తం చేశాడు. దీంతో ఆ అనుమానాస్పద వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై రాష్ట్ర డీజీపీకి, పటియాలా ఎస్​ఎస్​పీకి ఫిర్యాదు చేశా” అని సిద్ధు ట్వీట్​లో వెల్లడించారు. ఇటువంటి భద్రత లోపాలు.. పంజాబ్​ కోసం గొంతెత్తె తన నోటిని కట్టివేయలేవని తెలిపారు.

నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఏప్రిల్​ 1న విడుదల జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. 1988 డిసెంబరు 27న పటియాలలో పార్కింగ్‌ విషయంలో జరిగిన ఘర్షణలో 65 ఏళ్ల గుర్నామ్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. గతేడాది మే నుంచి పంజాబ్​లోని పటియాలా సెంట్రల్ జైల్లోనే ఉన్న ఆయనకు.. సత్ప్రవర్తన కారణంగా శిక్షా కాలం కాస్త తగ్గడంతో ఏప్రిల్ 1న విడుదలయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news