కరోనాకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవమ్మా!!

-

బైక్ పై ఇద్దరు వ్యక్తులు కనిపిస్తే పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు.. కారులో ముగ్గురు కనిపిస్తే ఆపేస్తున్నారు.. షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయ్యకపోతే తాటతీస్తున్నారు.. ప్రతీ చోటా ఈ రేంజ్ లో సోషల్ డిస్టెన్స్ పై అవగాహనను తమదైన శైలిలో అటు పోలీసులు, ఇటు నాయకులు, అధికారులు అంతా కల్పిస్తున్నారు.. మెజారిటీ ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. ఇదంతా ఒకెత్తు అయితే… తాజాగా జరిగిన రెండు సంఘటనలు దేశం ఉలిక్కిపడేలా చేస్తున్నాయి! వాటిలో ఒకటి ముంబయి లో జరగ్గా.. మరొకటి పశ్చిమ్ బెంగాల్ లో జరిగింది.

మంగళవారం ముంబయి బాంద్రా వలస కూలీలు ఒక్కసారిగా ఆందోళనకు దిగగా.. బుదవారం పశ్చిమ్ బెంగాల్ లో సుమారు 400 కుటుంబాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి బైఠాయించాయి. ఆదివారం చికెన్, మటన్ షాప్స్ దగ్గర నలుగురు పక్క పక్కన నిలబడితే కంగారు పడిపోవాల్సిన పరిస్థితిలో దేశ ప్రజలంతా ఉంటే… తాజాగా ఈ రెండు ప్రాంతాల్లో మాత్రం వందలాది మంది ప్రజలు మాస్కులు లేకుండా, భైతిక దూరం అనే టాపిక్కే లేకుండా గుంపులు గుంపులుగా రావడంలో తప్పు ఎవరిది? ప్రస్తుతం దేశ ప్రజలు, పాలకులు ఆలోచించాల్సిన విషయం ఇది!

మీ మట్టుకు మీరు లాక్ డౌన్స్ ఎత్తుకుంటూ పోతున్నారు.. ఇక్కడ మా బ్రతుకులు అటూ ఇటూ కాకుండా పోతున్నాయి అన్నట్లు ముంబయి లోని వలస కూలీలు మొత్తుకుంటుంటే.. గత 20 రోజులుగా తమకు తినడానికి తిండి లేదని, రేషన్ అందించమని పశ్చిమ్ బెంగాల్ లోని ప్రజలు మొర్రపెట్టుకుంటున్నారు. అందే వాళ్లకు అన్నీ అందుతున్నాయి.. అంతవరకూ అంతా హ్యాపీనే కానీ… ఇలా పట్టెడన్నం దొరక్క పిల్లా పాపలతో, ముసలీ ముతకతో రోడ్లపైకి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఏమనుకోవాలి.. ఎవరిని ఏమనాలి?

లాక్ డౌన్ పెట్టేయడంతో తమ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్న కొంతమంది పాలకులను అనాలా.. కడుపు మండుతున్నా, పసి పిల్లలు ఆకలికి గుక్కపట్టి ఏడుస్తున్నా కూడా భౌతిక దూరం పాటిస్తూ.. ఇంట్లో ఉండకుండా రోడ్లపైకి వచ్చిన ప్రజలను అనాలా? ఈ విషయంలో ప్రజలకు ఈ పరిస్థితి రాకుండా చూడాల్సింది మాత్రం ఖచ్చితంగా పాలకులే!

అయ్యో.. వీరికి రేషన్ అందలేదు కదా.. వీరిని వదిలేద్దాంలే! అయ్యో.. వీరిని ప్రభుత్వం ఆదుకోలేదుకదా.. కాస్త వీరిని లైట్ తీసుకుందాంలే! అయ్యో.. వీరిపట్ల ప్రభుత్వం కాస్త అలసత్వం ప్రదర్శించిందిగా.. పోనీలే కాస్త కనికరిద్దాం!.. అని కరోనా ఫీలవ్వదు అనే విషయం అటు నాయకులు, ఇటు ప్రజలు అంతా గమనించాలని… ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వాలు, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం! ఎందుకంటే… ఇంతకాలం చేసిన “జాగ్రత్త పోరాటం” అంతా ఒకెత్తు.. రాబోయే మూడు వారాల పోరాటం మరొకెత్తు!

Read more RELATED
Recommended to you

Latest news