ఉపఎన్నిక వేళ నెల్లూరు టీడీపీ నేతలు ఎందుకు సైడయ్యారు ?

-

ఒకప్పుడు బలంగా ఉన్న నెల్లూరు జిల్లా టీడీపీ నానాటికి తీసికట్టుగా తయారవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానై చక్రం తిప్పిన మాజీమంత్రి నారాయణ,కీలక నేతలు రాజకీయాలకు దూరంగా ఉండటంతో నెల్లూరులో టీడీపీ పరిస్థితి ధారుణంగా తయారైంది. నేతల ఆధిపత్యపోరు, వర్గ విభేదాలతో బలహీనమవుతున్న పార్టీ తిరుపతి ఉపఎన్నికల వేళ పూర్తిగా కుదేలైంది. ఆదుకుంటారన్న నేతలే ముఖం చాటేయడంతో పార్టీ కేడర్ కూడా పక్క చూపులు చూస్తుంది. కేడర్ ఉండి ఆర్ధికంగా చితికిపోయిన నేతలకు వల వేసి బీజేపీ వ్యూహం ప్రకారం క్యాష్ చేసుకుంటుంది.

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల్లూరులో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలకు ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇచ్చారు. బీద రవిచంద్రకు కూడా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. పార్టీ బలపడేందుకు అధినేత పూర్తి స్వేచ్చ ఇచ్చారు. అయితే నాయకులు ఆర్దికంగా బలపడ్డారు కానీ పార్టీ ఇంకాస్త బలహీన పడింది. 2019 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి ఒక్కసీటు కూడా రాలేదు. ఆ తర్వాత నారాయణ పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టగా బీదా రవిచంద్ర,సోమిరెడ్డి మాత్రం అపుడప్పుడు కనిపిస్తున్నారు.

ఇటీవల స్థానిక ఎన్నికల్లో రాజకీయంగా, ఆర్థికంగా అండగా ఉంటారనీ పార్టీ శ్రేణులు భావించాయి. ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డాయి. కానీ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పత్తా లేకుండా పోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తామేనన్న చందంగా వ్యవహరించి పనులు చేసుకుని లాభపడ్డ నాయకులు ఆ తర్వాత పత్తా లేకుండా పోయారట. ఆర్దికంగా ఖర్చు పెట్టగల మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు వంటి నేతలు సైతం అధికార వైసీపీకి జై కొట్టారు.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో సైతం భారీ కాంట్రాక్టులు దక్కించుకున్న ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు స్థానిక ఎన్నికల వేళ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. . కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి,గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్,సూళ్లూరుపేటలో మాజీ మంత్రి పరసారత్నం,ఆత్మకూరులో బొల్లినేని కుటుంబం మత్రం తమకేం పట్టనట్లు వ్యవహరించారు. కార్యకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు చాలామటుకు అధికార పార్టీ వేధింపులు, ఇబ్బందులు తట్టుకోలేక పక్క చూపులు చూస్తున్నారు.

ఉపఎన్నిక జరుగుతున్న తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న వెంకటగిరి,గుడూరు,సూళ్లూరుపేటలో బీజేపీ అధికార పార్టీ వ్యతిరేకతను తమకు అనూకులంగా మార్చుకుంటుంది. అధికార పార్టీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఎంపిక చేసుకుని.. వారికి అండగా బీజేపీ నేతలు నిలుస్తున్నారు. వారందర్నీ తమ పార్టీ వైపు తిప్పుకుంటున్నారు. ఒక్కచోట గంపగుత్తుగా వందలాది మందిని కమలం పార్టీ కార్యకర్తలుగా మార్చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news