ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి తన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్. తాజాగా తాను ట్విటర్ సీఈవోగా కొనసాగాలా లేదా వైదొలగాలా అని ప్రశ్నిస్తూ ట్విటర్లో చేసిన పోల్‌లో ప్రపంచ కుబేరుడికి చుక్కెదురైంది. మొత్తం 1.75కోట్లకు పైగా ఓట్లు పోలవ్వగా.. అందులో 57.5శాతం యూజర్లు ఎలాన్ మస్క్ వైదొలగాలంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 42.5శాతం యూజర్లు మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. యూజర్ల నిర్ణయానికి కచ్చితంగా కట్టుబడి ఉంటానంటూ చేసిన వాగ్దానంపై ఎలాన్ మస్క్ ఏం నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ట్విటర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ ఆ కంపెనీలో అనేక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ఆందోళన చెందుతున్న ప్రకటనదారులు ట్విటర్‌తో సంబంధాలను తెంచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన దానికి క్షమాపణలు కోరిన ఆయన.. ఇకపై అలా జరగదని హామీ ఇచ్చారు. ఇకపై ట్విటర్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా పోల్ నిర్వహిస్తానని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన ట్విటర్ ఖాతాలో నిర్వహించిన పోల్‌లో ప్రతికూల ఫలితం వచ్చింది.