ఎన్నికలు ఏవైనా.. టీడీపీ నాయకుల్లో ఉండే ఉత్సాహమే వేరు. సార్వత్రికమైనా.. స్థానికమైనా.. తమ్ముళ్లు ఎప్పుడూ ముందుం టారు. అధినేత ఆదేశమే తరువాయి! అన్నట్టుగా తమ్ముళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే, ఇప్పుడు మాత్రం వారిలో స్తబ్దత కనిపిస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సమరానికి తెరలేవనుంది. మనుటయా.. మరణించుటయా! అనే రేంజ్‌లో ఈ ఎన్నికలను అధికార పార్టీ వైసీపీ భావిస్తున్న నేపథ్యంలో అధికారంలోఉన్న ఆ పార్టీ కంటే కూడా రెండో సారి అధికారంలోకి రావా లని భావించి కోల్పోయిన టీడీపీలో ఎంత ఫైర్ ఉండాలి. అయితే, ఈ తరహా పరిస్థితి ఇప్పుడు నాయకుల్లో ఎక్కడా కనిపించడం లేదు.
గత ఏడాది జరిగిన పరాభవాన్ని తుడిచి పెట్టుకునేందుకు టీడీపీ భారీ ఎత్తున కసరత్తు చేసైనా.. గెలుపు గుర్రం ఎక్కి.. రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని.. పార్టీని పుంజుకునేలా చేయడంతోపాటు.. గత ఏడాది ఎన్నికలకు ముందున్న పరిస్థితిని కల్పించేందుకు ప్రస్తుత స్థానిక సమరం టీడీపీకి అందివచ్చిన అవకాశంగా మేధావి వర్గాలతోపాటు సానుభూతి పరులు కూడా భావిస్తున్నారు. ఇక పార్టీ అదినేత చంద్రబాబు కూడా ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆయన మనసుకు ఉన్న వేగం.. ఆయన పార్టీలోని నాయకులకు లేకపోవడం ఇప్పుడు చర్చకు వస్తున్న పరిణామం.. మరోపక్క, తాజగా ఎన్నికలపై ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలు వారిని మరింతగా హడలు కొడుతున్నాయి.
దీంతో నాయకులు ఎక్కడికక్కడ అసలు స్థానిక ఎన్నికలు అంటేనే హడలి పోతున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకూడదనే నిబంధన కామనే అయినా.. జగన్ ప్రభుత్వం మరింత సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికల సమయంలోనే కాకుండా తర్వాత గెలిచిన ప్పటికీ.. కూడా కేసుల కత్తి వెంటాడుతుందని, జైలుకు పంపిస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతో అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు? కేసుల పాలవడం ఎందుకు? అనే ధోరణి టీడీపీలో బాహాటంగానే వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బాహాటంగానే చెప్పేశారు. ఈ కేసులు వద్దు.. ఈ ఎన్నికలు వద్దు.. మేం ఎన్నికల్లో పోటీ చేసేదే లేదు! అని ఆయన చెప్పేశారు.
అంతేకాదు, పార్టీకి కూడా ఉచిత సలహా విసిరేశారు. టీడీపీ పోటీలో లేకుండా ఉంటేనే బెటరన్నారు. మొత్తంగా చూస్తే.. ఇదే తరహా పరిస్థితి అన్ని చోట్లా కనిపిస్తోంది. ఇప్పటికేఅనేకకేసుల్లో చిక్కుకుని అల్లాడుతున్న తమ్ముళ్లు పార్టీ నుంచి పెద్దగా భరోసాలేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా స్థానికంలో కేసులు ఎదుర్కొని జైలు కు వెళ్లడం ఎందుకనిఅంటున్నారు. ఈ క్రమంలో వీరిలో భరోసా నింపేదెవరనే ప్రశ్న సహజంగానే తెరమీదికి వస్తోంది. మరి దీనికి బాబు ఎలాంటి సొల్యూషన్ చూపిస్తారో చూడాలి.