మల్కాజ్ గిరి ఏసీపీ నరసింహ రెడ్డి ఇంటి తో పాటు మరో 24 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నామని ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ప్రాంతాలన్నీ నర్సింహారెడ్డి రెడ్డి స్నేహితులు, బందువులు, బినామిలవని ఆయన అన్నారు. వారందరి ఇళ్లలో సోదాలు చేస్తున్నామని ఆ 25 ప్రాంతాలనుండి ఇంకా సమాచారం రావాల్సి ఉందని అన్నారు. హైదరాబాద్ మహేంద్ర హిల్స్ లో జరిగిన సోదాల్లో కొన్ని ఆస్తుల పత్రాలు దొరికాయన్న ఆయన మహేంద్ర హిల్స్ లోని ఇంటి తో పాటు మరో రెండు ఇళ్ల ను గుర్తించామని అన్నారు.
ఐదు ఓపెన్ ప్లాట్స్ ను గుర్తించామని, బ్యాంక్ లాకర్లు ఇంకా చెక్ చేయాలి , బంగారం , వెండి మొత్తం ఎంత అనేది చూస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఐదు కోట్లకు పైగా ఆస్తులు గుర్తించామని ఆయన అన్నారు. కరీంనగర్ , వరంగల్, నల్లగొండ హైదరాబాద్ తో పాటు అనంతపురం లో సోదాలు కొనసాగుతున్నాయని అన్నారు. అయితే హైదరాబాద్ కి చెందిన ఓ ప్రజా ప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబందాలు ఉన్నట్టు మీడియాలో వస్తున్న కధనాలు నిజం కాదన్న ఆయన ప్రజా ప్రతి నిధుల లింకులు ఇంకా బయట పడలేదని ఈ విషయం మీద ఇంకా విచారణ చేస్తున్నామని అన్నారు.