ఆస్ట్రేలియాలో నూతన మీడియా చట్టం రూపుదిద్దుకుంది. ఇకపై సామాజిక మాధ్యమాల్లో మీడియా కంటెంట్ ప్రచురిస్తే సంబంధిత మీడియాకు డబ్బులు చెల్లించాలి. ఈ మేరకు ‘న్యూస్‌మీడియా బార్గైనింగ్ కోడ్’ బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంటు ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ దేశ కమ్యూనికేషన్స్ మంత్రి పాల్ ఫ్లైచర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఇకపై ఫేస్‌బుక్‌తో పాటు, గూగుల్ సంస్థలు కూడా తమ ఫ్లాట్ ఫాంలలో ప్రచురించే కథనాలకు ఆ దేశ మీడియా సంస్థలకు రుసుము చెల్లించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
దేశంలో మీడియా మాధ్యమాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవటంలో గూగుల్, ఫేస్‌బుక్‌లు ముందంజలో ఉన్నందుకు మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆ దేశంలో పబ్లిక్ జర్నలిజం వృద్ధి చెందటానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుంది ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం అమలులోకి రావటానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది. నిపుణుల విశ్లేషణలు జరిపిన అనంతరమే ఈ కోడ్ తెచ్చినట్లు మంత్రి వెల్లడించారు.
ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంతో ఇదే తరహాలో బిల్లును ప్రవేశపెట్టాలని అభిప్రాయపడుతున్న కెనడా, బ్రిటన్ వంటి దేశాలకు బలం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఫేస్‌బుక్ సహా గూగుల్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ ఆస్ట్రేలియాలో వార్తలను తన సామాజిక వేదికపై పంచుకోవడాన్ని కొద్ది రోజుల పాటు నిలిపివేసింది.
చర్చల ద్వారా ప్రభుత్వం పలు సవరణలకు అంగీకరించటంతో ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. దీంతో రెండు రోజుల నుంచే ఫేస్‌బుక్ తిరిగి ఆస్ట్రేలియాలో వార్తలను తన ఫ్లాట్ ఫాంలో ప్రచురిస్తుంది. ఏదైమైన ఈ చట్టం ఒకింత మీడియా సంస్థలకు మేలు చేసినా.. సామాజిక దిగ్గజాలైన ఫేస్‌బుక్, గూగుల్ నిట్టూరుస్తున్నాయి. అయితే ఈ కోడ్‌తో పబ్లిక్ ప్రయోజన జర్నలిజం మెరుగుపడుతుండటంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.