తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో నియోజకవర్గానికి ఒక విధంగా రాజకీయాలు మారుతున్నాయి. కొన్ని నియో జకవర్గాల్లో నాయకులు అంటీముట్టనట్టు ఉంటే.. మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకులు అతిగా ఉంటు న్నారు. ఇక, ఇంకొన్ని చోట్ల ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నారు. దీంతో అసలు తూర్పు వైసీపీలో ఏం జరు గుతోందనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన (పార్టీలతో సంబంధం లేకుండా) తోట త్రిమూర్తులకు, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకు మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
దీనికి కారణం ఆరు మాసాల కిందటే మొదలైంది. గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన తోట, వైసీపీ నుంచి బరిలో దిగిన వేణు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వేణు విజయం సాధించారు. దీంతో వేణు నియోజకవర్గంలో ఆధిపత్యం చలాయిం చాలని చూశారు. కానీ, ఇంతలోనే తోట టీడీపీ సైకిల్ దిగేసి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్పటి వరకు తోటతో విభేదించిన వేణు.. ఆయన రాకను తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. తోటపై విజయం సాధించేందుకు నానా తిప్పలు పడ్డానని, ఇప్పుడు అలాంటి నాయకుడిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
అయితే, వైసీపీలో వేణు మాట కన్నా తోట వ్యూహానికే మార్కులు పడ్డాయి. అయితే, అప్పటి నుంచి కూడా వేణు అవకాశం వచ్చినప్పుడల్లా తోటపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల పార్టీ సీనియర్లు వైవీ సుబ్బారెడ్డి వంటి నాయకులు వచ్చినప్పుడు వేణు తన అనుచరులతో వీరంగం సృష్టించారు. ఈ పరిణామాలు జగన్ దృష్టికి చేరాయని తెలిసింది. వేణు వ్యవహార శైలిపై జగన్ నివేదిక కోరినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తోట వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సుబ్బారెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనల్లో సంయమ నం పాటించానని చెప్పుకొచ్చారు. అంతేకాదు, పార్టీలో తన చేరిక ఇష్టం లేకున్నవాళ్లు అధినాయకుడికి చెప్పాలన్నారు.
ఇంకా పౌరుషం ఉంటే పార్టీకి రాజీనామా చేసి వెళ్లాలని తోట అన్నారు. ప్రతిపక్షాలు ఇటువంటి పనులు చేస్తే అర్థం ఉంటుందని, ఒకే పార్టీలో ఉంటూ అలజడి సృష్టించాలనే ఇటువంటి ప్రయత్నాలకు అవకా శం ఇవ్వకూడదనేదే తన అభిమతమన్నారు. ఇక్కడ జరిగిన గొడవల వల్ల పార్టీ, అధినాయకుడికి నష్టం జరగకూడదనే సంయమనం పాటించాలని కార్యకర్తలకు చెప్పానని ఆయన పేర్కొన్నారు. జరిగిన ఘట నలపై పోలీసులు వారి పనివారు చేస్తారని, తాను ఫిర్యాదు చేయబోనని తోట స్పష్టం చేశారు. ఇక ఈ సంఘటనపై అటు పార్టీ పరిశీలకులు సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవి వెంకట రమణ కూడా సీరియస్ అయ్యారు. అటు అధిష్టానం సైతం 24 గంటల్లో నివేదిక కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వేణు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు వైసీపీలోనే చర్చ సాగుతోంది. మరి జగన్ ఎలా రియాక్ట్ అవుతారో ? చూడాలి.