భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమో కాదో గాని ఎవరైనా ఇతర దేశాల అధ్యక్షులు వస్తే మాత్రం మన దేశం చాలా అభివృద్ధి చెందిన దేశంగా కనపడుతుంది. మూడేళ్ళ క్రితం హైదరాబాద్ లో ఒక కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె, ఇవాంకా ట్రంప్ రాగా… తెలంగాణా ప్రభుత్వం అప్పట్లో కాస్త జాగ్రత్తలు తీసుకుంది. హైటెక్ సిటీ ఫ్లైఒవర్ దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకుని అందంగా ముస్తాబు చేసింది.
అప్పుడు పెద్దగా ప్రజలు గాని వ్యాపారులు గాని ఎక్కడా ఇబ్బంది పడలేదు. కాని ఇప్పుడు ట్రంప్ అమెరికా నుంచి రావడంతో గుజరాత్ ప్రభుత్వం చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. గుజరాత్ లోని మోతెరా స్టేడియం కి ట్రంప్ వెళ్ళే దారిలో రంగులు వేసారు. గోడలకు రంగులు వేయడమే కాకుండా మురికి కాలవలు కనపడకుండా గోడలు కట్టారు. కొన్ని చోట్ల అయితే మరో అడుగు ముందుకి వేసి, కొన్ని ఆకృతులను ఏర్పాటు చేసారు.
సరే అది బాగానే ఉంది గాని ఇప్పుడు వివాదం చోటు చేసుకుంది. ట్రంప్ వెళ్ళే దారిలో ఉన్న తోపుడు బళ్ళను నాశనం చేస్తున్నారు అధికారులు. ప్రత్యేక జేసీబీ లను ఏర్పాటు చేసి వాటితో తోపుడు బళ్ళను నాశనం చేస్తున్నారు. దీనితో చిరు వ్యాపారులు ఇప్పుడు జీవనాధారం కోల్పోతున్నారు. రోడ్డు మొత్తం ఎలాంటి హెచ్చరిక లేకుండా ఇలా వ్యవహరిస్తున్నారు అధికారులు. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ వస్తే ఎవడికి గొప్ప అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. ఒకడి మెప్పు కోసం పేద వాడి పొట్ట కొట్టడం ఎంత వరకు మంచి పని అంటూ… అతను వస్తే మోడీ కి గొప్ప గాని పేద వాడికి ఎం అవసరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు. అభివృద్ధి చేతగాని వాళ్లకు నాశనం చేసే హక్కు లేదు అంటూ పలువురు తీవ్ర స్థాయిలో గుజరాత్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.