అక్టోబర్ 21న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దేశ రాజకీయ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండానే విడుదల చేశారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఏపీ ఎంపిల ఆందోళనతో కొత్త రాజకీయ మ్యాప్‌ను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మ్యాప్‌లో ఏపీకి రాజధానిగా అమరావతి అని ప్రకటించారు. వాస్తవానికి దేశంలోని అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు రాజధానులు ప్రకటిస్తూ కేంద్రం రాజకీయ మ్యాప్‌లను విడుదల చేయడం అనవాయితీ. కేంద్రం అమరావతిని రాష్ట్ర రాజధానిగా అయితే ప్రకటించింది..కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాజధానిగా అమరావతిని కొనసాగిస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
ఏపీలో రాజకీయ అధికార బదలాయింపు జరిగిన తరువాత సీఎం జగన్ అమరావతిపై అంత సానుకూలంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు పేరుకు ఏపీకి అమరావతి రాజధానిగా ఉంటుంది.. కానీ అసలు రాజధాని ఎక్కడ నిర్మిస్తారు అనేది ఇప్పటికి క్లారిటి లేదు. కేంద్రం అమరావతిగా రాజధానిని ప్రకటించినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ రాజధానిని నిర్మిస్తుందో వేచి చూడాలి.. అయితే అసలు కేంద్రం రాజధాని ని ప్రకటించే ముందు అసలు ఏపీకి రాజధాని ఎక్కడ అని ఓసారి పరిశీలిద్దాం.
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించింది కేంద్రం. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేండ్లు ఉంటుంది. దీని ప్రకారం ఏపీకి రాజధాని హైదరాబాద్. అది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం. పదేళ్ళ వరకు ఏపీలో ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా రాజధానిని నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. రాజధాని నిర్మాణంకు కేంద్ర ప్రభుత్వ సాయం తప్పనిసరి. అయితే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడగానే టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అయ్యారు. ఏపీకి రాజధాని లేకపోవడంతో ఆయన హైదరాబాద్ నుంచి పరిపాలన సాగిస్తున్న క్రమంలో ఉండవల్లిలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు.
అయితే చంద్రబాబు తెలంగాణలో ఓటు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యారు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబును ఈ కేసులో ఓ ఆటాడుకోవడంతో తెలంగాణలో ఉంటే మనుగడ సాగించడం కష్టమని భావించి ఏపీలో అమరావతి పేరుతో రాజధాని నిర్మాణం అంటూ హడావుడి చేశారు. అయితే ఇక్కడ ఓటుకు నోటు కేసు ప్రభావంతోనే హైదరాబాద్ రాజధానిని కాదని, అమరావతి కి ఫలాయనం చిత్తగించారు. దీంతో ఉమ్మడి రాజధానిపై తన హక్కును కొంత మేరకు చంద్రబాబు కొల్పోయేలా చేశారు.
అయితే చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం, తన అనుయాయులకు రియల్ పేరుతో కోట్ల రూపాయలు కట్టబెట్టేందుకు అమరావతిని రాజధానిగా చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు కుటిల యత్నం చేయడం తప్పతే ఆయన పెద్దగా చేసింది శూన్యమనే చెప్పాలి. అయితే కేంద్రం ఏపీకి రాజధానిగా హైదరాబాద్‌గానే భావిస్తుంది. అందుకే రాజకీయ మ్యాప్‌లో ఏపీ రాజధానిని ప్రకటించలేదని భావించాల్సి వస్తుంది. కేంద్రం అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటికి రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎక్కడ రాజధానిని నిర్మిస్తుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు.
ప్రస్తుతం నిర్మాణాలు జరుపుకుంటున్న ప్రాంతంలో రాజధాని ఉంటుందా.. లేక అమరావతి పేరుతో మరో ప్రాంతంలో రాజధానిని ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుందనే ప్రచారం ముమ్మరంగా జరుతుంది. అధికారం వికేంద్రికరణలో భాగంగా ఓకే చోట రాజధానిని నిర్మిస్తే అభివృద్ధి మందగిస్తుందనే భావనలో ఏపీ ప్రభుత్వం ఉన్న తరుణంలో రాజధానిని పలుచోట్ల నిర్మించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమరావతిని ప్రకటిస్తే.. ప్రదేశం ఒక్కడో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించబోతుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కోర్టులో రాజధాని భవితవ్యం ఉంది.