రాజ్యసభ ఎన్నికల ఫలితం… బాబుకు కొత్త బెంగ స్టార్ట్!

-

తమకున్న ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు ఎలాగూ రాజ్యసభ సీటు రాదు.. ఆ విషయం పోటీ చేయించిన చంద్రబాబుకూ తెలుసు, పోటీ చేసిన బలిపశువైన వర్ల రామయ్యకూ తెలుసు. వీరిద్దరికి కూడా తెలుసన్న విషయం అందరికీ తెలుసు. అయినా కూడా చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లో దళితుల ఆత్మాభిమానంతో ఆడుకునే పనిలో భాగంగా వర్ల రామయ్యను పోటీకి నిలబెట్టారు.. ఫలితం 17! ఇప్పుడు ఇదే బాబుకు నిద్రపట్టకుండా చేస్తున్న విషయం.. ఆ ఐదుగురూ.. ఆ ఐదుగురూ అంటూ శాడ్ సాంగ్ పాడుకునే పరిస్థితి తెచ్చింది!

అసలు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దిగకుండాపోయినా బాగుండేదేమో అని బాబు నిన్న రాత్రి నుంచి అనుకోని నిమిషం ఉండదేమో! పోటీ చేయడం వల్ల దళితుల ఆత్మాభిమానంతో ఆడుకున్నారన్న పేరు వచ్చింది.. తద్వారా దళితులు మరింత దూరమవుతున్నారు.. ఇంతకాలం మీడియాలో పార్టీ వాయిస్ ని గట్టిగా వినిపించే వర్లను బలిపశువును చేశామన్న అపఖ్యాతీ మిగిలింది.. సరికదా… ప్రస్తుత బలం 17 అని తేలింది! ప్రతిపక్ష నాయకుడి హోదాకే దెబ్బపడనుందన్న కొత్త బెంగ స్టార్ట్ అయ్యింది!

అవినీతి కేసులో అరెస్టవ్వడం వల్ల అచ్చెన్నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు… సరే! మిగిలినవారిలో అనుకోని షాకిచ్చిన ఆదిరెడ్డి భవానీ.. నేరం నాదికాదు అక్కడున్న అధికారిది అన్నట్లుగా చెప్పేసి ఇప్పటికి గట్టెక్కేశారు! ఇక మిగిలిన ముగ్గురు అయిన… కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ లు ఎలాగూ రెబల్స్ కాబట్టి… వారి సంగతేంటో చూద్దామని “విప్” జారీ చేశారు చంద్రబాబు! మీరు “విప్” జారీ చేస్తే మేము “టిక్” జారీ చేస్తామని.. తమ ఓటు చెల్లుబాటుకాకుండా… విప్ ను టిక్ తో కొట్టారు… బాబుకు తన వ్యూహం ఫలించిందన్న ఆ సంతోషం కూడా లేకుండా చేశారు!

వీరిసంగతి అలా ఉంటే… బాబును మరింత టెన్షన్ పెట్టిన వ్యక్తి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్! కరోనా పేరుచెప్పి హోం క్వారంటైన్ లో ఉన్నానని చెప్పి ఓటువేసేందుకు రాలేదు! బాబుకు ఇదో కొత్త టెన్షన్ గా తయారయ్యింది. అవసరమైతే, బాబు మాటపై అంత శ్రద్ధ, బాబుపై అంత గౌరవం ఉంటే… పీపీఈ కిట్లు ధరించి అయినా, వచ్చి ఓటు వేసి వెళ్లొచ్చు! కానీ… ఆయన రాలేదు.. ఫలితంగా బాబుకి టెన్షన్ తప్పలేదు!! దీంతో రెబల్స్ సంఖ్య అనుకోనివ్వండి.. జగన్ సానుభూతిపరుల సంఖ్య అనుకోండి.. మొత్తం మీద ఆ ఐదుగురూ బాబుకు రాజ్యసభ ఎన్నికల పేరు చెప్పి కొత్త టెన్షన్ పెట్టినట్లేనని పలువురు అభిపాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news