అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది. స్థానిక సంస్థల్లో వైసీపీ గెలుపు బాధ్యతను పార్టీ అధినేత, సీఎం జగన్.. పూర్తిగా వీరిపైనే పెట్టడంతో వారు అల్లాడుతున్నారు. నిజానికి స్థానిక సంస్థల్లో గెలుపు బాధ్యతను తీసుకునేందుకు వారు ముందుకు వచ్చారు. అయితే, జగన్ భారీస్థాయిలో హె చ్చరించే సరికి ఇప్పుడు వారిలో తీవ్ర ఆవేదన ఎదురవుతోంది. దీనికి ప్రధాన కారణం.. అధికారంలోకి వచ్చి కేవలం పది మాసాలే అయింది. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఇంకా చెప్పుకొనే స్థాయిలో అభివృద్ధి కార్యక్ర మాలు జరగలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు సాగుతోంది.
ఎంపీ అంటే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలంటే ఎంపీలకు పడడంలేదు. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఉప్పు నిప్పుగా ఉంటున్నాయి. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలను గెలచి తీరాలని జగన్ ఆదేశించడం, పదవుల కత్తి వేలాడుతుండడంతో నాయకులు అల్లాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికంగా వారిపై ఒత్తిడి కూడాపెరుగుతోంది. పైగా ఎన్నికల్లో డబ్బు పంచొద్దని, మద్యం పంచొద్దని అధినేత ఆదేశించడంతో మరింతగా నాయకులు అల్లాడుతున్నారు. “నిన్న మొన్నటి వరకు ఉన్న అలవాటును హఠాత్తుగా ఎత్తేస్తే.. ప్రజలు మనవైపు తిరుగుతారా? మనకు ఓటేస్తారా?“ అనే భావన కూడా నాయకుల్లో ఉండడం గమనార్హం.
ఇక, మహిళలకు మంచి చేయాలనేఉద్దేశంతో జగన్ మద్య నిషేధాన్ని ఎత్తుకున్నారు. అయితే, దీనివల్ల పురుషుల ఓటింగ్‌పై ప్రభావం పడుతోందనేది వాస్తవం అంటున్నారు నాయకులు. నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అలవాటు ఉంది. ఇప్పుడు మద్యం విషయంలో ప్రబుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పురుషుల్లో చాలా ఆగ్రహం ఉంది. కేవలం మహిళా ఓటు బ్యాంకుతోనే గట్టెక్కుతామనేది కూడా వాస్తవం కాదు అనేది నాయకుల మాట. ఈ క్రమంలో ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతు న్నారు.
స్థానికంగా అభివృద్ధికి నిధులు ఇస్తామని ఇవ్వలేదు. దీని ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో తమపై ఒత్తిడి తగ్గించేలా చూడాలని వారు జిల్లా ఇంచార్జ్ మంత్రులను వేడుకుంటున్నారు. కానీ, వారు మాత్రం జగన్ ఏం చెబితే అదే జరుగుతుంది! అంటూ వ్యాఖ్యానిస్తుండడంతో ఏం చేయాలో తెలియక నాయకులు తలలు పట్టుకుంటున్నారు.