మ‌హా ట్విస్ట్‌: ఆ మూడు పార్టీల డీల్ ఓకే అయిందా..?

-

తాజాగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు మూడు వారాలు కావస్తున్నప్పటికీ ఏ ఒక్క పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోవడంతో.. రాష్ట్రపతి పాలన కోసం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేశారు. అయితే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలోని అనిశ్చితికి తెరదింపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అధికారాల పంపిణీకి సంబంధించి ఎన్‌సీపీ, శివసేన, కాంగ్రెస్ మధ్య ‘డీల్’ దాదాపు కుదిరినట్టేనని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో ’50-50′ షేరింగ్ ఫార్ములాకు శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ, ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన ఒక అవగాహనకు వచ్చినట్టు చెబుతున్నారు.

ఆ ప్రకారం ముఖ్యమంత్రి పదవిని ఆ రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్లు పంచుకుంటాయి. ప్రభుత్వ ఏర్పాటులో తృతీయ భాగస్వామిగా ఉండే కాంగ్రెస్‌కు ఐదేళ్ల పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయిస్తారు. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి విషయంలో ఇంకా ఎలాంటి అంగీకారానికి రాలేదని చెబుతున్నారు. దీనిపై చర్చలు కొనసాగిస్తారు. 50-50 ఫార్ములాతో పాటు, శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వ కనీస ఉమ్మడి కార్యక్రమానికి సంబంధించి మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి రాగానే లాంఛనంగా సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news